సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్: రైల్వే షాకింగ్ నిర్ణయం
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వేలోకి ప్రవేశించిన తర్వాత ప్యాసింజర్ల నుండి మంచి స్పందన లభించింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ రైళ్లకు విశేష డిమాండ్ ఉంది. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా, ప్రయాణికులకు మరింత సౌకర్యాలు అందిస్తుండటంతో ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కానీ, సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాత్రం అందుకు భిన్నంగా, ఖాళీ సీట్లతో నడుస్తోంది. ఈ రైల్లో 80 శాతానికి పైగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి, దీని వల్ల రైల్వే అధికారులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
ఈ రూట్ ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు తరచుగా ప్రయాణిస్తుంటారు. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 16న కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది. ఈ రైలు ద్వారా రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా విదర్భ, రామగుండం, కాజీపేట వంటి పారిశ్రామిక నగరాలను అనుసంధానించే ఈ రైలుకు అనుకున్న స్థాయిలో స్పందన రాకపోవడం అధికారులు ఆశ్చర్యపోతున్నారు. మొదట్నుంచీ ఈ రైల్లో ఎక్కువ సీట్లు ఖాళీగా ఉంటున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ రైలులో మొత్తం 1,440 సీట్లు ఉన్నప్పటికీ, 1,200కి పైగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. అలాగే, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లలోనూ కేవలం 10 మంది ప్రయాణికులు మాత్రమే రిజర్వేషన్ చేసుకున్నారు. రైల్వే అధికారులు ఇప్పుడు ఈ రైలు కోచ్‌లను తగ్గించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం 20 కోచ్‌లతో నడుస్తున్న ఈ రైలును 8 కోచ్‌లకు తగ్గించి, సీట్ల సంఖ్యను 500కు పరిమితం చేయాలని చూస్తున్నారు.
ఇదే సమయంలో సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైళ్లు పూర్తిగా బుకింగ్ అయ్యాయి. ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ రేట్లు 90% నుంచి 100% మధ్య ఉన్నాయి. విశాఖపట్నం వందే భారత్ రైల్లో టిక్కెట్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటం విశేషం.
ఈ రైలు సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గంలో కాజీపేట, రామగుండం వంటి కీలక స్టేషన్లలో ఆగుతుంది. మొత్తం 7.15 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది.
రైల్వే అధికారులు ప్రయాణికుల తక్కువ స్పందనను దృష్టిలో ఉంచుకొని, రైలు సేవలను సవరించే నిర్ణయానికి వచ్చారు